సారంగాపూర్ మండలంలోని ధని గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, స్పందన లేకపోవడంతో గ్రామ యువకులు స్వయంగా ముందుకు వచ్చారు.
రహదారిపై ఉన్న గుంతల్లో మొరం పోసి పూడ్చివేసి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యలపై అధికారుల కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా స్పందించి, పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిచర రమేష్, పంబల నవీన్, నవకాంత్ పాల్గొన్నారు. యువకుల చొరవను గ్రామస్థులు అభినందించారు.












