ప్రజా క్షేత్రంలో పాత్రికేయుడికి ఓర్పు, సహనం, సామాజిక బాధ్యత, ప్రజా సమస్యలపై అక్షర యుద్ధం చేసే తత్వం, ప్రశ్నించే ధైర్యం అవసరం. విజయాల వెంట పరుగులు పెట్టడం కంటే.. అపజయాలను, అవమానాలను, నిందలను ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే నిజమైన విజయం సొంతమవుతుంది.
పాత్రికేయ వృత్తిలో నైతిక విలువలకు కట్టుబడి, మంచి సమాజ నిర్మాణం కోసం జీవితాలను అంకితం చేసిన ఎందరో అక్షర యోధుల జీవిత గాథలను అక్షరాల ద్వారా పరిచయం చేస్తూ.. నన్ను తీర్చిదిద్దిన గురువుగా, నా పాత్రికేయ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అక్షర అధ్యయనం ద్వారా పరిష్కరించుకునే దిశగా మార్గనిర్దేశం చేసిన వ్యక్తి మా గురువుగారు పూరి రాజారత్నం.
అక్షరాన్ని ఆయుధంగా మలిచి, పాత్రికేయ వృత్తిలో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆయనను అక్షర యోధుడిగా, అక్షర సరస్వతి ముద్దుబిడ్డగా అభివర్ణించవచ్చు.
ఆయన మార్గదర్శకత్వంలోనే దేశవ్యాప్తంగా ట్రావెల్ జర్నలిస్టుగా నాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకునే స్థాయికి నన్ను తీర్చిదిద్దిన సీనియర్ జర్నలిస్టుగా ఆయన అందించిన ప్రోత్సాహం, మార్గనిర్దేశం నా జీవితంలో ఎప్పటికీ మరువలేనిది.
అక్షరాన్ని నమ్ముకుని.. ప్రజల పక్షాన నిలిచి.. సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న మా గురువుగారు పూరి రాజారత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరెన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.












