ఖరీఫ్ (వానాకాలం) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని ఆయన అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ధాన్యం దిగుబడి వివరాలు సేకరించి, అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, తూనికలు కొలతల అధికారి శంకర్, డీసీవో నర్సయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












