జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం నేరమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తుంటే వారి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని, వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్గమధ్యంలోనే అడ్డుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం కూడా నేరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జూరాల ప్రాజెక్టు కింద ఇప్పటికే రైతులు పంటలు సాగు చేశారని, ఈ కీలక సమయంలో సాగునీరు విడుదల చేయకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు రామచందర్ రావు గారు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పక్షాన మాట్లాడుతున్న నాయకులను అడ్డుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
జూరాల ప్రాజెక్టును 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించినప్పటికీ, పూడిక పేరుకుపోవడం వల్ల పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పూడిక సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలపై మాట్లాడుతున్న నాయకులను పోలీసులతో అడ్డుకోవడం మానుకోవాలని ఆయన అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు నష్టపోయిన తర్వాత బోనస్ ఇచ్చే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించకూడదని నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు వాణిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాలమూరు రైతుల కష్టాలను అర్థం చేసుకుని, జూరాల ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. ఇప్పటికే పంటలు వేసుకున్న రైతులను ఆదుకుని, వారి పంటలను కాపాడాలి.
రైతుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. రైతుల హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతుల గొంతుకగా నిలబడతాం. రైతుల కోసం నినదిస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఈ కార్యక్రమంలో టి. చారి, గువ్వల బాలరాజు, శాంతి కుమార్, బస్వా నరసయ్య, నరేందర్ రావు, దిలీప్ చారి, సత్య యాదవ్, అందే బాబయ్య, కేవీఎన్ రెడ్డి, ఎగ్గా నరసింహులు, పద్మజ రెడ్డి, పవన్ కుమార్, గోలి మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, బాల, త్రిపుర సుందరి, సాహితి, జనార్దన్ రెడ్డి, బాపు రెడ్డి, బొక్క బాల్ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.












