బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. కొల్లూరు, తాడకోల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, బుడ్మి సొసైటీ పరిధిలోని తాడకోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలతో పోలిస్తే బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరి కోతలు ముందుగానే ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, వారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ-గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకం ధాన్యాన్ని రూ.2,441 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, పొల్లు లేకుండా, తేమ శాతం 17లోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.












