నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన పలు భారీ షాపింగ్ మాల్స్ వద్ద సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. మాల్స్‌కు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రహదారులపైనే నిలిపివేయాల్సి వస్తుండటంతో ప్రధాన మార్గాల్లో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది.
కొన్ని వాణిజ్య సముదాయాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ సదుపాయాలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో పార్కింగ్‌కు వినియోగించకపోవడంపై స్థానికులు, వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ద్విచక్ర వాహనాలు, కార్లు రహదారుల వెంట అస్తవ్యస్తంగా నిలిచిపోతున్నాయి. రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ఒకే మార్గంలో ఇరుక్కుపోతుండటంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు సమయం పడుతోంది.
నిబంధనలు అమలవుతున్నాయా
వాణిజ్య సముదాయాలకు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్ సదుపాయాలు, వాహనాల రాకపోకలకు అవసరమైన స్థలం వంటి అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.
మాల్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రహదారులపై వాహనాల నిలుపుదలను నియంత్రించడంతో పాటు, మాల్స్ యాజమాన్యాలు తమ వినియోగదారులకు తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచాలని, ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల వద్ద పార్కింగ్ నిబంధనల అమలుపై అధికారులు దృష్టి సారిస్తే ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు.












