సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఆందోళనకు దిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షురాలు అనూరాధతో పాటు పలువురు గాయాలపాలయ్యారు. వేలాది మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
వెట్టి చాకిరీ నుంచి విముక్తి, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం అమలు, నిర్దిష్ట ప్రమోషన్ చానల్ కల్పన, నష్టదాయకమైన జీవో 11 రద్దు, సర్వేల భారం తగ్గింపు, జీవో 5 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియ పునఃసమీక్ష వంటి డిమాండ్లతో సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై నిర్బంధాలు విధించడంతో పాటు కొందరు యూనియన్ నాయకులను సస్పెండ్ చేసింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది.












