హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కోరింది.
హెచ్ఎండీఏ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు, అర్బన్ ఫారెస్ట్రీ, పార్కులు, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులతో సీఐటీయూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సవరించిన కనీస వేతనాల జీవో నంబరు 6 ప్రకారం హైదరాబాద్ జోన్1 పరిధిలోని కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో ప్రకారం, నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.16 వేలు, పాక్షిక నైపుణ్యం కలిగిన వారికి రూ.17 వేలు, నైపుణ్యం కలిగిన వారికి రూ.18,500, అధిక నైపుణ్యం కలిగిన వారికి రూ.20 వేలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే, కార్మికులకు ఈ వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు నగదు రూపంలో చెల్లింపులు చేస్తున్నారని, దీనివల్ల వేతన చెల్లింపుల్లో పారదర్శకత, అధికారిక గుర్తింపుపై సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరికీ కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను పక్కాగా అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
సీఐటీయూ మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ విభాగాల్లో వందలాది మంది కార్మికులు కీలక సేవలు అందిస్తున్నారని వివరించారు. హుస్సేన్‌సాగర్ పరిసరాలు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నీరు పోయడం, తోటల నిర్వహణ వంటి పనులు చేస్తున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనాన్ని పరిరక్షించడం, మొక్కల కత్తిరింపు, రోడ్డు మధ్య డివైడర్లలో మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
పర్యాటక ప్రాంతాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల పర్యవేక్షణ, టోల్ వసూళ్లు, భద్రతా విధులతోపాటు రోడ్ల మరమ్మతులు, ఫ్లైఓవర్ల నిర్వహణ, వీధి దీపాల పర్యవేక్షణ వంటి ఇంజినీరింగ్ పనుల్లోనూ కార్మికులు సేవలందిస్తున్నారని వివరించారు.
ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని, ప్రతి నెల ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులు, జాతీయ పండుగల సెలవులు అమలు చేయడంతోపాటు కార్మికులందరికీ తొమ్మిది రకాల రక్షణ పరికరాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని హెచ్ఎండీఏ సంస్థను డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక












