భూత్పూర్, 15 September
భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సూచించారు. భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూత్పూర్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి భూత్పూర్: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సూచించారు. భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, వివిధ సమస్యలపై కౌన్సిలర్లు, అధికారులతో చర్చించారు. సమావేశంలో పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరా, మురుగునీటి పారుదల, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, దోమల నివారణ, రహదారులు తదితర సమస్యలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చోట స్తంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మురుగునీటి పారుదల, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి కుటుంబానికి తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణకు క్రమం తప్పకుండా పిచికారీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఏడాదిలో నూతన మున్సిపల్ కార్యాలయం భూత్పూర్ మున్సిపాలిటీకి ఆధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపాదిత భవన నమూనాను పరిశీలించిన ఆయన ఏడాది కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ రహదారి పక్కన సౌకర్యాల మెరుగుదల మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సేవా రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, రహదారి పక్కన ఉన్న మురుగునీటి కాలువలను మరమ్మతు చేసి మెరుగుపరచాలని సంబంధిత సంస్థ ప్రతినిధులను కోరారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారి పరిధిలోని మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. తండాల అభివృద్ధికి ప్రాధాన్యం మున్సిపాలిటీ పరిధిలోని తండాల్లో రహదారులు, తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సమావేశాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూత్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, వివిధ శాఖల అధికారులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












