ముప్కల్, మెండోరా ఉమ్మడి మండలాల పరిధిలో జరిగిన అంతర్ పాఠశాల కోకో పోటీల్లో పోచంపాడు బాలుర గురుకుల పాఠశాల ప్రథమ స్థానం సాధించారు. ముప్కల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అద్భుతమైన ఆటతీరు కనబరిచారు.
17 ఏళ్లలోపు బాలుర విభాగంలో జరిగిన ఈ పోటీల్లో పోచంపాడు గురుకుల పాఠశాల ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభతో విజేతలుగా నిలిచారు. ఈ విజయంపై పాఠశాల ప్రధానాచార్యులు బి. మైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను ఏటీపీ అశ్విని అభినందించారు. ఉపప్రధాన వార్డెన్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ ఏడాది వాలీబాల్ పోటీల్లోనూ పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నిరంతరం శిక్షణనిస్తూ వారి ప్రతిభను వెలికితీసి విజేతలుగా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుడు సీహెచ్. సంజీవ్‌ను ప్రధానాచార్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.











