భువనగిరి, 8 September
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, దాని సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిని స్మరించుకుంటూ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి ఒక భావోద్వేగ రచన చేశారు. బాబు అని పిలవాలని, ఆ నాయకుడిని ఒక్కసారి హత్తుకోవాలని ఉందని ఆమె తన రచనలో పేర్కొన్నారు.
బాబు… అని పిలవాలని ఉన్నది… — మంజుల పత్తిపాటి. మన కోసం… మన పిల్లల భవిష్యత్తు కోసం… తన ఊపిరినే ఉద్యమంగా మార్చి, తన చెమట చుక్కలనే చరిత్రాక్షరాలుగా చెక్కి, తెలంగాణ గుండె చప్పుడును ఢిల్లీ గోడల దాకా వినిపించి, అధికార పీఠాలను కదిలించి, తెలంగాణ తల్లి ఒడిలో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఆ ఉద్యమ శిఖరాన్ని ఒక్కసారి హత్తుకోవాలని ఉన్నది…! పల్లె నుంచి పట్నం దాకా ప్రజల గుండెల్లో పోరాట జ్వాలను రగిలించి, మలిదశ ఉద్యమాన్ని మహోద్యమంగా మలిచి, తెలంగాణ జనాన్ని ఒకే తాటిపై నిలిపిన ఆ ఉద్యమ జ్వాలను ఒక్కసారి చూడాలని ఉన్నది…! మా బతుకులకు బాటలు వేయడం కోసం… మా భవిష్యత్తుకు వెలుగులు పంచడం కోసం… తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్షరమై… ఆశయమై… ఆకాంక్షమై… ఉద్యమమై మలిచిన ఆ తెలంగాణ ముద్దుబిడ్డను ఒక్కసారి దగ్గరగా చూడాలని ఉన్నది…! తెలంగాణ నేల కోసం… తెలంగాణ నీటి కోసం… తెలంగాణ నిధుల కోసం… తెలంగాణ ఆత్మగౌరవం కోసం… అలుపెరుగని అడుగులతో, అవిశ్రాంత పోరాటం చేసిన ఆ ఉద్యమ ధీరుడి ముందు ఒక్కసారి నిలిచి మనసారా హత్తుకోవాలని ఉన్నది…! బాబు…” అని పిలవాలని ఉన్నది… ఒక్కసారి కాదు… గుండె ఉన్నంతకాలం ఆ పేరునే పలకాలని ఉన్నది…! రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి. చరవాణి 9347042218 ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రం



