కుంటాల మండలంలోని లింబా కె, లింబా బి గ్రామాల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లింబా కెలో మహిళా సమైఖ్య భవనం, హెల్త్ సెంటర్ భవనాలను ఆయన ప్రారంభించగా, లింబా బిలో గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. లింబా కె గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, హెల్త్ సెంటర్ భవనాలను ఆయన ప్రారంభించారు. అదే విధంగా 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న అంగన్ వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. లింబా బి గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ప్రతి గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశామని, ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గత పది సంవత్సరాల పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని విమర్శించారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌కు లింబా కె, లింబా బి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పులతో, మహిళలు మంగళ హారతులతో, పూలు చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు సర్పంచులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి, స్థానిక నాయకులు, అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












