స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేస్తూ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూనే, కీలక సూచనలు అందించారు.
విశాఖపట్నం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలను జగన్ వివరించారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. నాడు-నేడు (మనబడి) కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేశామని, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచామని, పథకంలో వైద్య ఖర్చును రూ.25 లక్షల వరకు పెంచామని చెప్పారు. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్ వచ్చాయని, వ్యవసాయ రంగంలోనూ కనీవిని ఎరుగని మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. నేటి పరిస్థితి చూస్తే అంతా రివర్స్ అయిందని, అంతా అస్తవ్యస్తంగా మారిందని జగన్ వ్యాఖ్యానించారు.
రూపాయికి చాక్లెట్ కూడా వస్తుందో లేదో తెలియదు కానీ, 99 పైసలకే విశాఖలో భూములు ఇచ్చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రతి ఊరిలో మందుతో పాటు, గంజాయి దొరుకుతోందని, గుడి, బడి పక్కన ఇవన్నీ దొరుకుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం, అదానీ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియకు నాంది పలికిందన్నారు. చివరకు ఎవరూ పట్టించుకోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు పరిష్కారంగా, మండలం నుంచి రూ.600 కోట్లతో తాగునీరు సరఫరా చేశామని చెప్పుకొచ్చారు. గీతం వర్సిటీకి చెందిన 55 ఎకరాల భూమిని కబ్జా చేశారని, దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు ఉంటుందని, దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేష్ తోడల్లుడికి ఇచ్చేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని, పార్టీ మీకు పూర్తిగా తోడుగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. విశాఖలో తొలిసారిగా నీటి ఎద్దడి ఏర్పడిందని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉంటే మరో 75 టీఎంసీల నీరు స్టోర్ చేయవచ్చని, కానీ చంద్రబాబు దాని ఎత్తు తగ్గించారని చెప్పుకొచ్చారు.












