ఐఐటీ బాంబే విద్యార్థి సహిల్ వాకోడే మృతి కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. న సహిల్ మృతి చెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇందులో సహిల్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఇతర సంబంధిత వ్యక్తులు ఉన్నారు.
అదే సమయంలో అతడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. దర్యాప్తులో భాగంగా సహిల్ పరీక్ష రాస్తున్న సమయంలో ఏం జరిగిందనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పరీక్షలో ఫోన్ ఉపయోగించి చీటింగ్ చేశాడనే ఆరోపణలతో అతడిని పరీక్ష హాల్ నుంచి బయటకు పంపినట్లు ఇప్పటికే సమాచారం వెలువడింది.
పరీక్షలో పట్టుబడటం, క్షమాపణ లేఖ
సహిల్ తన చివరి ఫోన్ సంభాషణలో పరీక్షలో పట్టుబడ్డ విషయాన్ని ప్రస్తావించినట్లు ఓ స్నేహితురాలు పోలీసులకు చెప్పినట్లు కూడా దర్యాప్తు వివరాల్లో వెల్లడైంది. అయితే ఈ అంశాలు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో భాగంగా ఉన్నాయని, వాటిపై తుది నిర్ధారణ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా సహిల్ నుంచి ఒక క్షమాపణ లేఖ తీసుకున్నారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పరీక్షలో అక్రమ పద్ధతికి పాల్పడ్డాడనే ఆరోపణల అనంతరం అతడితో ఈ లేఖపై సంతకం చేయించినట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి.
ఐఐటీ బాంబే నిబంధనలు, కమిటీ పాత్ర
అయితే ఐఐటీ బాంబే 2015లో రూపొందించిన పరీక్షా అక్రమాల నిర్వహణ విధానంలో ఇలాంటి క్షమాపణ లేఖ తీసుకోవాలనే నిబంధన స్పష్టంగా లేదని సమాచారం. ఐఐటీ బాంబే విధానం ప్రకారం, పరీక్ష సమయంలో విద్యార్థి అక్రమ పద్ధతికి పాల్పడినట్లు ఇన్విజిలేటర్ గుర్తిస్తే సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకుని, విద్యార్థికి కొత్త జవాబు పత్రాన్ని ఇచ్చి పరీక్ష కొనసాగించే అవకాశం కల్పించాలి. అనంతరం వ్యవహారాన్ని డిపార్ట్మెంటల్ అకడమిక్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత అకడమిక్ మాల్‌ప్రాక్టీస్ జరిగిందా లేదా అన్నది కమిటీ నిర్ణయిస్తుంది.
డిజిటల్ ఆధారాల సేకరణ
సహిల్ కు చెందిన రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ను ముంబైలోని కలీనా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. వాటిలోని సమాచారాన్ని యాక్సెస్ చేసి, ఘటనకు ముందు సహిల్ ఎవరితో మాట్లాడాడు, ఏ సందేశాలు పంపాడు, అతడి చివరి గంటల్లో ఏం జరిగిందన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలు ఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడంలో కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావించారు.
మరోవైపు, సహిల్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఐఐటీ బాంబేలో కుల వివక్ష, వేధింపులను ఎదుర్కొన్నాడని ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఐఐటీ బాంబే కుల వివక్ష ఆరోపణలను ఖండించింది. ఈ ఆరోపణలు, పరీక్షలో జరిగిన ఘటన, సహిల్ మృతికి ముందు చోటుచేసుకున్న పరిణామాలన్నింటినీ పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సహిల్ మృతికి ఏ ఒక్క అంశమే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చలేదు.
కేసులో భాగంగా ఇప్పటికే 40 మంది వాంగ్మూలాలు నమోదు కావడం, డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పరీక్షా ఘటన, క్షమాపణ లేఖ, కుల వివక్ష ఆరోపణలు, ఇతర పరిణామాల మధ్య ఉన్న సంబంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












