జపాన్‌లోని నిషిన్‌లో జరిగిన ఆసియా క్రీడలు2026 పురుషుల క్రికెట్ కాంస్య పతక మ్యాచ్‌లో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌పై 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
మూడో స్థానం కోసం జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభం పేలవంగా సాగింది. కేవలం 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అనంతరం కెప్టెన్ సహన్ అరచిగే 33 పరుగులు, థరిందు రత్నాయకే 32 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 93 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక 165 పరుగుల పోటీతత్వ స్కోరు సాధించింది.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు సైఫ్ హసన్, తంజీద్ హసన్ తమీమ్, కెప్టెన్ లిటన్ దాస్ ముగ్గురూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. దీంతో బంగ్లాదేశ్ 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం పరవేజ్ హొస్సేన్ ఎమోన్, యాసిర్ అలీ, నసుమ్ అహ్మద్ కొంత ప్రతిఘటించినా, వికెట్లు వరుసగా పడిపోవడంతో లక్ష్యానికి దూరమైంది. నసుమ్ అహ్మద్ 26 పరుగులతో జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు.
శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార, థరిందు రత్నాయకే, విజయకాంత్ వియస్కాంత్, వనుజ సహన్ తలో రెండు వికెట్లు సాధించారు. దీంతో బంగ్లాదేశ్ 102 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో శ్రీలంక ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.












