మాకవరపాలెం, 29 October
మండలంలో 16 ఎంపీటీసీ సిగ్మెంట్లకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. మొత్తం 110 దరఖాస్తులు రాగా, వాటిలో 80 మాత్రమే నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు.
మండలంలో 16 ఎంపీటీసీ సిగ్మెంట్లకు వేసిన నామినేషన్లను శనివారం పరిశీలించారు. మూడు రోజులు పాటు జరిగిన నామినేషన్ ప్రక్రియలో 16 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను 110 దరఖాస్తులు వచ్చినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. శనివారం నామినేషన్ల పరిశీలన అనంతరం 80 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. ఎంపీటీసీ సెగ్మెంట్లకు తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలిపారు. టిడిపి 34, వైఎస్ఆర్సిపి 36, జనసేన 4, బిజెపి 4, కాంగ్రెస్ 2 నామినేషన్లు నిబంధన ప్రకారంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఒకే అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లు వేసినప్పటికీ, పరిశీలన అనంతరం ఒక్కో అభ్యర్థికి ఒక నామినేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ సిగ్మెంట్ల వారీగా నామినేషన్లను పరిశీలన చేయగా 80 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నట్లు గుర్తించామన్నారు.
అభ్యర్థులకు ఎవరైనా ఇతరులపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం ఉందని, అభ్యంతరాల అనంతరం, ఎవరైనా పోటీ నుంచి విరమించుకునే అవకాశం ఉందని అప్పారావు నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సహాయక రిటర్నింగ్ అధికారులుగా తహసిల్దార్ కాకర నూకరాజు, ఎంపీడీవో చాయి సుధా వ్యవహరించారు. శనివారం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన సందర్భంగా, తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయ ప్రాంగణంలో వేచి ఉన్నారు. తమ అభ్యర్థుల నామినేషన్లు సుఖాంతంగా పరిశీలన పూర్తి కావడంతో ఇరు పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితాను కార్యాలయంలో అతికించినట్లు తెలిపారు.











