Ward 22, Wanaparthy, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
వనపర్తి మున్సిపాలిటీ 22వ వార్డులో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఏర్వ అరుణ భర్త, మెకానిక్ శ్రీను స్వయంగా కాలువలోకి దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధమని చాటారు.
మురికి కాలువలోకి దిగి చెత్త తొలగించిన కౌన్సిలర్ భర్త.... అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదంటూ ఆగ్రహం... ప్రజల కోసం స్వయంగా రంగంలోకి. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఏర్వ అరుణ భర్త, మెకానిక్ శ్రీను స్వయంగా మురికి కాలువలోకి దిగి చెత్తను తొలగించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమని చాటిచెప్పారు. 22వ వార్డులోని మురికి కాలువలో కొంతకాలంగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని శ్రీను పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సమస్యలు పరిష్కరించాలి.... ఈ సందర్భంగా మెకానిక్ శ్రీను మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కొన్ని రోజులుగా సంబంధిత అధికారులను కోరుతున్నప్పటికీ స్పందన లేదన్నారు. పార్టీలను చూడకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తమ కాలనీలోని మురికి కాలువలో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు తొలగించకపోవడం బాధాకరమన్నారు. తమపై కక్ష సాధింపు ధోరణితోనే సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అధికారుల కోసం ఎదురుచూడకుండా తన వార్డు ప్రజల సమస్యను తానే పరిష్కరించేందుకు మురికి కాలువలోకి దిగి చెత్తను తొలగించినట్లు శ్రీను తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ఇకనైనా స్పందించి వార్డులో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు.












