కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ మండల మకరవిళక్కు తీర్థయాత్రకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సమాచారం అందించేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దర్శనం, రవాణా, వసతి, వైద్య సేవలు, అత్యవసర సహాయం తదితర వివరాలను ఒకే వేదికపై అందించేలా సబరి డిజిటల్ పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించారు.
భక్తులు ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. తప్పిపోయిన వ్యక్తులు, పోగొట్టుకున్న వస్తువుల గురించి కూడా భక్తులు పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దర్శనం కోసం వేచి ఉండే సమయం, పూజల వేళలు, పంబా నది నీటిమట్టం, వైద్య కేంద్రాలు, మరుగుదొడ్లు, తాగునీటి కేంద్రాలు, పార్కింగ్ వివరాలు కూడా ఈ డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంటాయి. కేరళ ఆర్టీసీ బస్సులు, రైళ్ల సమయాల వివరాలను కూడా పొందవచ్చు. దుకాణాల్లో అధిక ధరలకు వస్తువులు విక్రయించకుండా ధరల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బిల్లు ఇవ్వకపోయినా, అధిక ధరలు వసూలు చేసినా భక్తులు కొనుగోలు చేసిన వస్తువులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. భక్తుల భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ ఏర్పాట్లన్నీ తీర్థయాత్ర సజావుగా సాగేలా చూడటానికేనని అధికారులు తెలిపారు.











