కుబీర్ మండలంలో రాత్రివేళల్లో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన అటవీ సంపద తరలిపోతున్నా కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మండల ప్రత్యేక సమావేశంలో సర్పంచులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కుబీర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి రాత్రివేళల్లో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన అటవీ సంపద అక్రమంగా తరలిపోతున్నా కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండల ప్రత్యేక సమావేశంలో పలువురు సర్పంచులు అటవీశాఖ అధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అసలైన కలప స్మగ్లర్లను వదిలేసి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్న సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు.
ఇటీవల చొండి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్రమంగా తరలిస్తున్న కలప బయటపడటం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. కలప రవాణాపై ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు, ముందస్తుగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్న చందంగా అధికారుల వ్యవహారశైలి ఉందని సమావేశంలో సర్పంచులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఒకటి రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, అక్రమ కలప రవాణా వెనుక ఉన్న అసలైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మరోవైపు రైతులు తమ వ్యవసాయ భూముల్లో స్వయంగా పెంచుకున్న చెట్లను వ్యక్తిగత అవసరాల కోసం నరికినా కేసులు నమోదు చేస్తున్న అధికారులు, రాత్రివేళల్లో భారీగా కలప తరలిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలే తప్ప, రైతులపై కఠినంగా వ్యవహరించి అక్రమ రవాణాదారుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదని వారు అంటున్నారు.
అక్రమంగా కలపను తరలిస్తే కేసులు నమోదు చేస్తున్నామని, ఇప్పటికే కేసులు నమోదు చేశామని, జేసీబీలపై కూడా కేసులు పెట్టామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ (కుబీర్) తెలిపారు. ఎక్కడైనా స్మగ్లింగ్ జరిగితే తమకు సమాచారం అందించాలని, ఈ విషయమై బీట్ ఆఫీసర్లకు హెచ్చరిస్తామని ఆయన అన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలని స్థానికులు సూచిస్తున్నారు.
కలప తరలింపులో ఉపయోగిస్తున్న వాహనాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అటవీశాఖ సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించాలని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటవీ సంపదను కాపాడటంతో పాటు రైతులకు, ప్రజాప్రతినిధులకు అనవసర ఇబ్బందులు కలగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.












