నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ)ను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం ప్రభుత్వ సంస్థగా పరిగణించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైంది, దాని ఛైర్మన్ నియామకం, పాలక మండలి కూర్పు, పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విస్తృత నియంత్రణ ఉందని ధర్మాసనం పేర్కొంది.
సంస్థ పుస్తకాల విక్రయం ద్వారా సొంత ఆదాయం పొందుతున్నప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ ప్రభావం తగ్గదని తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ ఆర్థిక, పరిపాలనా, విధుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో లోతుగా ఉన్నందున ఆర్టికల్ 12 పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ గుర్తింపు కారణంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రభుత్వ శాఖగా మారదని, అందులో పనిచేసే ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరని వివరించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రాజ్యాంగ రక్షణలు ఆటోమేటిక్‌గా వర్తించవని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. నేషనల్ బుక్ ట్రస్ట్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసి ఢిల్లీ హైకోర్టు పూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది.











