ఉద్యోగుల సామాజిక భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో తప్పనిసరి సభ్యత్వానికి ఉన్న వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో సుమారు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
సుమారు 12 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్ వేతన పరిమితిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త వేతన పరిమితి అమల్లోకి రావడంతో, నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య వేతనం పొందుతున్న ఉద్యోగులు కూడా తప్పనిసరి భవిష్య నిధి పరిధిలోకి రానున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పెరిగిన పరిమితితో ప్రయోజనాలు
ఇప్పటివరకు, నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ వేతనం పొందుతూ కొత్తగా ఉద్యోగంలో చేరిన కొంతమంది కార్మికులు తప్పనిసరి భవిష్య నిధి వ్యవస్థ వెలుపల ఉండే అవకాశం ఉండేది. పరిమితిని రూ.25 వేలకు పెంచడంతో, రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతన శ్రేణిలో ఉన్న కొత్త ఉద్యోగులు కూడా చట్టబద్ధమైన సామాజిక భద్రతా వ్యవస్థలోకి వస్తారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులు, పెన్షన్, బీమా రక్షణ పరిధిని విస్తరించడంతో పాటు అధికారిక ఉద్యోగ వ్యవస్థను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందని అధికారిక ప్రకటన పేర్కొంది.
భవిష్య నిధితో పాటు సంబంధిత పెన్షన్, బీమా రక్షణ పరిధి కూడా మరింత విస్తరించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా, వ్యవస్థీకృత రంగంలో ఉపాధిని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.












