కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. 2027 వర్షాకాలానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
మూడు బ్యారేజీల భద్రతను పటిష్టం చేయడంతోపాటు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట కుందన్ బాగ్ లో ఉన్న తన అధికారిక క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
పునరుద్ధరణ ప్రణాళిక వివరాలు
ప్రాజెక్టు డిజైనర్ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో గ్రౌటింగ్ ద్వారా పునాదులను బలోపేతం చేయడం, స్టిల్లింగ్ బేసిన్లను పొడిగించడం, కొత్తగా కట్-ఆఫ్ వాల్స్ నిర్మించడం వంటి కీలక పనులు ఉన్నాయని మంత్రి తెలిపారు. వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడంతోపాటు పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, పునాదుల కింద నీటి చొరబాటును అరికట్టడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ)తోపాటు ఇతర నిపుణుల కమిటీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
భద్రత, నాణ్యతపై రాజీ లేదు
బ్యారేజీల నిర్మాణ భద్రత, పునరుద్ధరణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల ఆధారంగానే ప్రతి పని జరుగుతుంది అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపాదిత డిజైన్లను పుణేలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూపీఆర్ఎస్)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుందో, ప్రతిపాదించిన చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారని చెప్పారు. ఖరారు చేసిన డిజైన్లను న న్యూఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. కమిటీ నిపుణులు వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తారని తెలిపారు.
అనుమతులు రాగానే పనులు ప్రారంభం
సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన సమగ్ర వ్యయ అంచనాలను నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి కోసం అవసరమైన కాంట్రాక్టు విధానాన్ని కూడా ఖరారు చేస్తున్నట్లు తెలిపారు.
డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లను పిలిచి, పనులను అప్పగించేలా మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనుల అమలులో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.












