వనపర్తి జిల్లా మండలంలోని ఏదుట్ల గ్రామంలో అర్హులైన పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామానికి చెందిన ఇద్దరు రేషన్ డీలర్ల పరిధిలో మాజీ ఎంపీటీసీ భర్త, మాజీ సింగిల్ విండో సభ్యులు కర్ణిక రాములు బినామీ వ్యక్తిగా జోక్యం చేసుకుంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంలో కర్ణిక రాములు పాత్ర కీలకంగా ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం పేద ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా కొందరి ఇష్టానుసారంగా వ్యవహారం సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ డీలర్లకు సంబంధించిన పంపిణీ వ్యవహారంలో బినామీ వ్యక్తుల ప్రమేయం ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయంపై గ్రామస్తులు, గ్రామ నిరుద్యోగులు ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేసినా సంబంధిత కింది అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసలు బియ్యం పంపిణీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది, మాజీ ఎంపీటీసీ భర్త, మాజీ సింగిల్ విండో సభ్యులు కర్ణిక రాములుకి ఈ వ్యవహారంతో సంబంధం ఎంతవరకు ఉంది అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
అధికారుల తనిఖీ
తాజాగా శనివారం ఉదయం, సంబంధిత రెండు రేషన్ డీలర్ల తరఫున బినామీగా వ్యవహరిస్తున్న కర్ణిక రాములు బియ్యం పంపిణీ చేస్తుండగా రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి, లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ బినామీ బియ్యం ఇస్తుండడంతో అధికారులు ఫోటోలు, వీడియో రికార్డింగ్లు చేశారు. ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని జీపీఓ సురేష్ తెలిపారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఇద్దరు రేషన్ డీలర్ల రికార్డులు, ఈ-పాస్ వివరాలు, బియ్యం పంపిణీ తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






