మిర్యాలగూడ, 14 November
విద్యార్థినులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) సూచించారు. శనివారం మండలం శ్రీనివాస్ నగర్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి గేమ్స్ స్పోర్ట్స్ మీట్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పోర్ట్స్ మీట్లో భాగంగా విద్యార్థినులతో కలిసి వివిధ ఆటల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థినులు తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ తోపాటు పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అను కరుణ, ఉపాధ్యాయ బృందం, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






