పుణే, ముంబై, మహారాష్ట్ర (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మహారాష్ట్రకు చెందిన ప్రతీక్షా తోండ్వాల్కర్ నిరూపించారు. భర్తను కోల్పోయి, ఏడాది బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె, ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్వీపర్‌గా పనిచేసి, అదే సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.
జీవితం ఎన్నో పరీక్షలు పెట్టినా పట్టుదల ముందు అవి తలవంచక తప్పవని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన ప్రతీక్షా తోండ్వాల్కర్. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ఏడాది వయసున్న బిడ్డతో ఒంటరి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్వీపర్‌గా పనిచేసి, అదే సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
1964లో పుణేలో జన్మించిన ప్రతీక్ష చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమయ్యారు. ఏడో తరగతి తరువాత చదువు ఆగిపోగా, చిన్న వయసులోనే వివాహమైంది. అయితే వివాహమైన మూడేళ్లకే రోడ్డు ప్రమాదంలో భర్త సదాశివ్ కడు మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా కష్టాల్లో పడింది. అప్పటికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లు. చేతిలో ఏడాది వయసున్న బిడ్డ.. కుటుంబ పోషణకు ఆదాయం లేకపోవడంతో కుట్టుపని, అల్లికలు చేస్తూ జీవన పోరాటం సాగించారు.
రూ.60 జీతంతో ఉద్యోగ ప్రారంభం
భర్తకు రావాల్సిన బకాయి జీతం కోసం ముంబైలోని ఎస్బీఐ శాఖకు వెళ్లిన ప్రతీక్ష.. తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఐదు నెలల నిరీక్షణ అనంతరం 1985లో పార్ట్‌టైమ్ స్వీపర్‌గా అవకాశం లభించింది. నెలకు కేవలం రూ.60 నుంచి రూ.65 జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. బ్యాంకు తెరవకముందే శుభ్రత పనులు పూర్తి చేసేవారు. అయితే ఆ ఉద్యోగాన్నే తన ఎదుగుదలకు తొలి మెట్టుగా భావించారు.
ఉద్యోగంతోపాటే చదువు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుకోవాలనే ఆశయాన్ని వదులుకోలేదు. పాత పుస్తకాలను సేకరించి రాత్రివేళల్లో చదువుకునేవారు. స్వయంగా పదో తరగతికి సిద్ధమై 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం రాత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సైకాలజీలో పట్టా పొందారు.
స్వీపర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరకు
1985లో స్వీపర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె.. 1990లో శాఖాపరమైన పరీక్షలో విజయం సాధించి గుమాస్తా స్థాయికి ఎదిగారు. అనంతరం వరుసగా పదోన్నతులు పొందుతూ అధికారిగా, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. 2020లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాను సాధించారు. 1993లో ప్రమోద్ తోండ్‌వాల్కర్‌ను రెండో వివాహం చేసుకోగా, ఆమె చదువు, ఉద్యోగ పురోగతికి ఆయన ప్రోత్సాహం అందించారు.
ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ నేర్చుకోవాలనే ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. పదవీ విరమణ అనంతరం సుమారు 55 ఏళ్ల వయసులో ప్రకృతి వైద్య విద్యను అభ్యసించి రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు. వయసు అనేది విద్యాభ్యాసానికి అడ్డంకి కాదని తన ఆచరణతో చాటిచెప్పారు.






