ఎరుట్ల మండలంలోని తడపాకల్, దొంచందా, గుమ్మిర్యాల్ గ్రామాల శివారులో ప్రవహిస్తున్న గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి, మండల కేంద్రం ఏర్గట్ల తోపాటు తాళ్లరాంపూర్, తడపాకల్, బట్టాపూర్, తోర్తి గ్రామాలకు నీళ్లు అందించాలని, తద్వారా రైతులకు అండగా నిలబడాలని కోరుతూ, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాటికి వినతిపత్రం అందజేశారు.
మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామ శివారులోని నదిపై చెక్ డ్యాం వంటి కట్టడం నిర్మించి, నీటిని నిల్వ చేసి, ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా గుమ్మిర్యాల్, నాగేంద్ర నగర్ గ్రామాలకు, మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు, రైతులకు అనుకూలమైన స్థలాలకు అందించడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, తద్వారా రైతుల బోరుబావులు ఎల్లప్పుడూ నీటితో నిండుగా ఉంటాయని, ప్రతి సీజన్లో అన్ని రకాల పంటలు పండించి సంతోషంగా ఉంటారని దయానంద్ విజ్ఞప్తి పత్రంలో తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కలెక్టర్‌కు అందజేసిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
దీనితో పాటు మండలంలోని బట్టాపూర్ గ్రామంలో సుమారు 40 విద్యుత్ స్తంభాలు అవసరమని, గ్రామ శివారులోని మల్లన్న స్వామి ఆలయం నుండి శుక్రవారం దేవి అమ్మవారి ఆలయం వరకు విద్యుత్, నీటి సౌకర్యం కోసం కొత్త మీటర్ ఏర్పాటు చేయాలని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డీడీ కట్టారని తెలిపారు. మల్లన్న స్వామి ఆలయం వద్ద నుండి శుక్రవారం దేవి అమ్మవారి ఆలయం వరకు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారి డీఈ టెక్నికల్ వెంకటరమణకు తెలపగా, రెండు నెలల్లోపు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, సౌకర్యం ఏర్పాటు చేస్తామని అధికారి హామీ ఇచ్చారని దయానంద్ అన్నారు.






