సాలూరు, నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 10
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేసి గెలిచిన వారికి టీడీపీ కూటమిలోకి ప్రవేశం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కక పోవడంతో కూటమిలోని మూడు పార్టీల నుంచి చాలా మంది రెబెల్స్‌గా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో బలమున్నవారు గెలిచి సత్తా చాటారు. జీవీఎంసీలో ఏకంగా 9 మంది రెబెల్స్ గెలిచారు. వీరంతా కూటమి టికెట్ దక్కలేదని ఆగ్రహించి బరిలోకి దిగినవారే. అలాగే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఏకంగా 10 మంది రెబెల్స్ కౌన్సిలర్లుగా గెలుపొందారు. వీరే కాకుండా ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లోనూ, పరిషత్తు ఎన్నికల్లోనూ కూటమి పార్టీల నుంచి చాలా మంది రెబెల్స్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు.
దిగ్భ్రాంతికర నిర్ణయం
దీంతో రెబెల్స్ అంతా తమ సొంత పార్టీలలోకి తిరిగి వెళ్లిపోవచ్చని భావిస్తున్న నేపథ్యంలో కూటమి పెద్ద చంద్రబాబు దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రెబెల్స్ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతిభావంతులు ఎందరో ఉన్నప్పటికీ, సీట్లు దక్కనప్పుడు బరిలోకి దిగి రెబెల్స్‌గా మారడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కూటమి సర్దుబాట్ల కోసం త్యాగాలు చేసిన వారికే గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు.
భారీగానే రెబెల్స్
ఇక చూస్తే, స్థానిక ఎన్నికల్లో ఈసారి భారీగానే రెబెల్స్ గెలిచారని అంటున్నారు. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, స్థానిక పొత్తులు, టికెట్ల కేటాయింపుల్లో సమన్వయ లోపం కారణంగా చాలా చోట్ల రెబెల్స్ బరిలోకి దిగి గెలిచారు. ఇలా రెబెల్స్‌గా దిగినవారు కేవలం వార్డులకే పరిమితం కాకుండా చాలా చోట్ల కీలక పదవులు అందుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ రెబెల్ అభ్యర్థి లంక అప్పలనాయుడు, సాలూరులో మరో టీడీపీ రెబెల్ అరుణ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకుని పార్టీలకు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన రెబెల్ అభ్యర్థి, అధికారిక బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
రెబెల్స్ భవిష్యత్తు ఏమిటి
నిజానికి రెబెల్స్ అంతా తమ సొంత పార్టీల పట్ల విధేయులుగానే ఉన్నారు. తమకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో పోటీకి దిగారు. తమ బలాన్ని, విజయాన్ని చాటిచెబితే తిరిగి పార్టీలో చేరిపోవచ్చని భావించారు. గతంలో ఇలా చాలాసార్లు జరిగింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని భావించిన వారికి బాబు నిర్ణయం పూర్తిగా డైలామాలో పడేసింది. పార్టీ అండ లేకుండా స్వతంత్ర అభ్యర్థులుగా వారు ఏమి సాధిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, వారికి మద్దతుగా ఉన్న క్యాడర్ కూడా సొంత పార్టీ వైపు నిలబడితే మరింత ఒంటరి అవుతారని అంటున్నారు.
నిజానికి, రెబెల్స్ విషయంలో టీడీపీ ఒంటరిగా ఉంటే ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుండేది. కానీ, మూడు పార్టీల కూటమిగా ఉంది. రెబెల్స్ బరిలోకి దిగడం వల్ల మిత్రపక్షాలకు భారీ నష్టం వాటిల్లింది. సాలూరులో జనసేనకు చైర్మన్ సీటు కేటాయించాల్సి ఉండగా, అక్కడ రెబెల్ అభ్యర్థి గెలిచారు. అలాగే, బీజేపీకి నెల్లిమర్ల నగర పంచాయతీని కేటాయించాల్సి ఉండగా, అక్కడ టీడీపీ రెబెల్ అభ్యర్థి గెలిచారు. అంతేకాకుండా, అనేక చోట్ల రెబెల్స్ వల్ల వైసీపీ విజయావకాశాలు పెరిగాయని కూడా తెలుస్తోంది. దీంతోనే చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.






