ముధోల్ నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అదనపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మరిన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముధోల్ నియోజకవర్గానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినందుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన బాసర, , ముధోల్, లోకేశ్వరం, నర్సాపూర్ (జి) మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని కోరారు.
మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు ఇతర మండలాల్లో పంజాబ్‌కు చెందిన వ్యక్తులు భూములు కొనుగోలు చేసిన సర్వే నంబర్లలో మిగిలిన భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఈ సమస్యపై గతంలో నిర్మల్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.











