జాతీయ విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఆధ్వర్యంలో శంకర్ భవన్ పాఠశాలలో చిత్రలేఖనం, ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులను రెండు కేటగిరీలుగా విభజించి ఈ పోటీలు జరిగాయి.
రీజినల్ ప్రావిడెంట్ కార్యాలయ కమిషనర్ రాహుల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్, అసిస్టెంట్ డైరెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరేపల్లి సాయిన్న, జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్, ఉపాధ్యాయులు మల్లేశం, రాములు పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులలో పాయల్ రెడ్డి, సమీక్ష, కూనాల్, హరితేజ, నవ్య, భైరవిలకు కమిషనర్ రాహుల్ కుమార్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి అవగాహన కల్పించడానికి పాఠశాలలో పోటీలు నిర్వహించామని తెలియజేశారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి చైతన్య కార్యక్రమాలు, పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు సాయిన్నగారు తెలిపారు.
జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మాట్లాడుతూ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జాతీయస్థాయిలో అధికారుల అవినీతి, వివిధ స్థాయిలలో జరిగే అక్రమాలపై చర్యల కోసం సీబీఐకి సిఫార్సులు చేస్తుందని తెలియజేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుందని, ఇది చట్టబద్ధమైన సంస్థ కాబట్టి జాతీయస్థాయిలో పారదర్శకంగా అవినీతి నిర్మూలనకు ఉపయోగపడుతుందని సీనియర్ ఉపాధ్యాయులు మల్లేశం వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.












