భైంసా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. గురువారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మంది ఎంబీబీఎస్, 6గురు ఎన్ఐటీ, ఐఐటీ విద్యార్థులను, 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
నియోజకవర్గంలో విద్యార్థులు పెద్ద మొత్తంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడంతోపాటు, కొంతమంది విద్యార్థులు ఎన్ఐటీ, ఐఐటీలో రాణించడం శుభాపరిణామం అన్నారు. చదువుతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతామని, ఇష్టపడి చదివి విద్యార్థులు అనుకున్న గమ్యానికి చేరుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో విద్యారంగంపై ప్రధాన దృష్టి సారించామని, అందులో భాగంగానే ముధోల్‌లో దాదాపు 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, మండలంలో మోడల్ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చి తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. విద్యా, వైద్యం, రైతాంగానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ, అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి భోజన్న, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు రమణారావు తదితరులు పాల్గొన్నారు.



