నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా పి. ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్హెచ్ఓ శ్రీలత స్థానంలో, ఇంతకుముందు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన పి. ప్రసాద్‌ను నియమించారు. గురువారం ఆయన మహిళా పోలీస్ స్టేషన్లో పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పి. ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా గృహహింస, వరకట్న వేధింపులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
కుటుంబ సమస్యల కారణంగా విడాకులు కోరుతూ మహిళలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే, ముందుగా వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, దాని ద్వారా సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పి. ప్రసాద్ చెప్పారు.
మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టపరంగా వారికి అందాల్సిన సహాయాన్ని అందించేందుకు మహిళా పోలీస్ స్టేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పి. ప్రసాద్ తెలిపారు.












