ఖానాపూర్ రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఐండ్ల రవీందర్, టింబర్ డిపో లైసెన్స్ పునరుద్ధరణ కోసం రూ.12 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
టింబర్ డిపో లైసెన్స్ పునరుద్ధరణ కోసం సెక్షన్ ఆఫీసర్ ఐండ్ల రవీందర్ మొదట రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడు కోరడంతో చివరకు రూ.12 వేలకు ఒప్పందం కుదిరిందని, తనిఖీకి వచ్చి, పై అధికారులకు నివేదిక పంపేందుకు డబ్బులు ఇవ్వాలని అధికారి కోరినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. రూ.12 వేల లంచం తీసుకున్న అనంతరం ఆ మొత్తాన్ని తన కారులో దాచుకున్నట్లు తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు కారులోని నగదును స్వాధీనం చేసుకుని రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుడిని కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వాట్సాప్ నంబర్ 9440446106కు సందేశం పంపాలని డీఎస్పీ సూచించారు. అవినీతిపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.






