నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి గ్రామం భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా ముందుకు రావాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. నిర్మల్ పోలీస్.. మీ పోలీస్ అని పేర్కొంటూ ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆమె అన్నారు.
మండలంలోని చింతకుంట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బ్యాండ్ మేళాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చిన్న గ్రామమైనప్పటికీ చింతకుంట గ్రామస్థులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని ఆమె అన్నారు. చింతకుంటను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని ఇతర గ్రామాలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామాల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టమై, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకారం అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై బిట్ల పెర్సిస్ పనితీరును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, సీఐ, ఎస్సైలను ఘనంగా సన్మానించారు. పోలీసులు సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో బాసర ఎస్హెచ్ఓ దీపక్, ఎస్సై బిట్ల పెర్సిస్, సర్పంచ్ లక్ష్మీ గంగాధర్, వీడీసీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, క్యాసర్ రమేష్, మురళి కమిటీ సభ్యులు, ఎస్ కే బాబా, లక్ష్మన్, భూచన్న, భోజన్న గ్రామస్థులు పాల్గొన్నారు.












