జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురంధరపాలెం గ్రామం జగన్నన్న కాలనీ సమీపంలోని లక్ష్మమ్మ చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నర్సీపట్నం పట్టణంలోని నలందా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శుక్రవారం జగన్నన్న కాలనీ సమీపంలో బంతితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బంతి చెరువులో పడటంతో దాన్ని తీసుకునేందుకు ముగ్గురూ నీటిలోకి వెళ్లారు. ఈ సమయంలో యెనమరెడ్డి చరణ్ శ్రీనివాస్ రెడ్డి (15) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
సమాచారం అందుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటపాటు గాలించిన అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సూచన
చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరుల సమీపంలో పిల్లలు ఆటలు ఆడే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.












