సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న దుర్వాసన, కాలుష్యం, ఆరోగ్య సమస్యలపై బీజేపీ నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డు కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన దుర్వాసన, వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్‌ను అభ్యర్థించారు. హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను బీజేపీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి అందె బాబయ్య కలిసి సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యను సమగ్రంగా వివరించారు. డంపింగ్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను వారు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకెళ్లారు. దుర్వాసన, కాలుష్యం, చెత్త వ్యర్థాల ప్రభావం, తద్వారా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, పరిసరాల పరిశుభ్రత లోపించడం వంటి అంశాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమస్య తీవ్రతను స్వయంగా తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సిద్ధాపూర్‌కు వెళ్లనున్నారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశోక్ గౌడ్, వంశీకృష్ణ, శ్రీనివాస్ చారి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.












