శ్రీకాకుళం కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికల్లో మేయర్ సీటుకు మాజీ మంత్రి దివంగత గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ పట్ల కుటుంబం కనబరిచిన నిబద్ధతకు, నిజాయితీకి ప్రతిఫలంగా ఈ పదవి లభించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి దివంగత గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభవార్త చెబుతారనే ఊహాగానాలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికల్లో మేయర్ సీటుకు గుండ కుటుంబం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుండ కుటుంబం టీడీపీ పట్ల కనబరిచిన నిబద్ధతకు, దశాబ్దాలుగా రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ సంపాదించుకున్న పేరుకు ప్రతిఫలంగా ఈ ఉన్నత పదవి లభించవచ్చని అంటున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకోబోతున్నాయని భావిస్తున్నారు.
ఎన్టీఆర్ మెచ్చిన నేత
ఈ ఏడాది జనవరిలో కన్నుమూసిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, ఎన్టీఆర్ మెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు. 1983 ఎన్నికల్లో తంగి సత్యనారాయణ శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున గెలిచి, స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు వెంట నిలిచి ఎన్టీఆర్ నుంచి దూరం జరి ు. దీంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో న్యాయవాదిగా ఉన్న గుండ అప్పల సూర్యనారాయణకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు. అంతేకాక, ఆయన మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా కొన్నాళ్లపాటు సేవలు అందించారు. వరుసగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి 2014లో టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
టికెట్ దక్కలేదని
అయితే, 2019లో లక్ష్మీదేవి ఓటమి చెందారు. 2024లో ఆమెకు టికెట్ దక్కాల్సి ఉండగా, చివరి నిమిషంలో యువ నేత గోండు శంకర్‌కు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ, కొంత మనస్తాపానికి గురైనా గుండ అప్పల సూర్యనారాయణ టీడీపీ విజయానికే కృషి చేశారు. ఆయన జీవించి ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చేవారని చెప్పుకున్నారు. కానీ ఆయన మరణంతో ఆ కుటుంబానికి రాజకీయంగా న్యాయం చేయాలని భావించిన చంద్రబాబు, గుండ లక్ష్మీదేవిని మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, గుండ కుటుంబానికి శ్రీకాకుళంలో ఉన్న రాజకీయ పలుకుబడి వంటి అంశాలన్నీ కలిస్తే సులభంగా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు.
వైసీపీకి ఇబ్బందే
గుండ లక్ష్మీదేవి కుటుంబానికి శ్రీకాకుళం పట్టణంలో పట్టు ఎక్కువగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా, వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు కేవలం ఐదు వేల మెజారిటీ మాత్రమే దక్కింది. శ్రీకాకుళం పట్టణంలో గుండ లక్ష్మీదేవికి వేయి ఓట్ల మెజారిటీ వచ్చింది. శ్రీకాకుళం, మండలాల్లో ఆమెకు ఆరు వేల మెజారిటీ రాగా, ధర్మాన కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే శ్రీకాకుళంలో గుండ కుటుంబానికి అంత బలం ఉందని గుర్తించిన టీడీపీ కూడా ఆమెకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. దీనివల్ల గుండ కుటుంబానికి న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. గుండ కుటుంబం పోటీకి దిగితే, బలమైన అభ్యర్థిని నిలబెట్టడం వైసీపీకి కష్టసాధ్యమవుతుందని అంటున్నారు.












