మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు సంహారకం (హెర్బిసైడ్) అయిన పారాక్వాట్ డైక్లోరైడ్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ రసాయనాన్ని నిషేధించిన దాదాపు 70 దేశాల సరసన భారత్ చేరింది.
నిపుణుల కమిటీ సిఫార్సులు, రిజిస్ట్రేషన్ కమిటీ సంప్రదింపుల అనంతరం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పారాక్వాట్ డైక్లోరైడ్ కొత్త రిజిస్ట్రేషన్లపై తక్షణ నిషేధం అమల్లోకి రావడమే కాకుండా, గతంలో జారీ చేసిన పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లన్నింటినీ రద్దు చేశారు. ఈ ఏడాది జులై 10న విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు సలహాలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.












