అప్పుల భారం, పంట నష్టాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు గొల్ల గోవింద (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
వ్యవసాయ పెట్టుబడులతో పాటు బోరు ఏర్పాటుకు సుమారు రూ.16 లక్షల వరకు అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సాగు చేసిన టమోటా పంటకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక గోవింద తీవ్ర ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లిన గోవింద.. గాజుల తిమ్మరాయప్ప చేను సమీపంలోని బోయల వంక వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం అందింది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య గొల్ల మమత (32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












