జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారికి అప్పగించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సూచనల మేరకు ఆ పార్టీ గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.
సుమారు రూ.5 కోట్లతో నిర్మించిన ఈ భవనం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో జిల్లాలోని దళిత వర్గాల ప్రజలు భవన సేవలను పూర్తిగా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. భవనంలో ప్రతిధ్వని నివారణ చర్యలు చేపట్టడంతో పాటు కుర్చీలు, ఏసీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, రంగులు వేయించి తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. అంతేకాకుండా, అంబేద్కర్ భవనంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, భవన నిర్వహణ బాధ్యతలను సైతం ఎస్సీడీడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా ఉన్నారని, కాబట్టి అధికారులు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసి భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని వారు సూచించారు.












