గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పాటలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు.
జనతా గ్యారేజ్ క్రైం నెం:- 31 కార్యక్రమంలో సోమవారం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని తనకు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఒక్క డీజే వాహనం కూడా సీజ్ చేయకూడదని పోలీసు శాఖకు లోకేష్ విజ్ఞప్తి చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా డీజేలకు అనుమతులు ఇచ్చారని, మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డీజే వాహనాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.
భక్తులు వాహనాలపై కేసీఆర్ పాటలు పెట్టుకొని నృత్యాలు చేస్తున్నారన్న అక్కసుతోనే డీజేలకు అనుమతులు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాటలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్మూర్ నుంచి అచ్చంపేట వరకు గణేష్ నిమజ్జనంలో కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇకనైనా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి, పరిమితులకు అనుగుణంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో డీజేలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.












