విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురువుకు అక్షర నీరాజనం కవితా పోటీలో ప్రముఖ కవి, రచయిత, బహుభాషావేత్త డా. పెరుక రాజు విజేతగా నిలిచారు.
గురువు ఔన్నత్యాన్ని, గురుశిష్య అనుబంధంలోని ఆత్మీయతను, గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతలను అక్షర నీరాజనంగా ఆవిష్కరించిన ఆయన కవిత విశేషంగా నిలిచింది. సాహిత్య ప్రమాణం, భావగాఢత, కొత్తదనం, అభివ్యక్తి తదితర అంశాల ఆధారంగా ఆయన కవితను విజేతగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా విశ్వ సాహితీ కళావేదిక చైర్పర్సన్ శ్రీమతి కళావతి డా. పెరుక రాజును అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు గురువుల పట్ల ఉన్న గౌరవాన్ని, కృతజ్ఞతను హృద్యంగా ప్రతిబింబించాయని కొనియాడారు.
మీ సాహితీ ప్రయాణం నిరంతరం కొనసాగాలి. మీ కలం నిత్యం కదలాలి. మీ అక్షరాలు సమాజానికి స్ఫూర్తిదీపాలుగా వెలగాలి అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి జి. భవానీ (మహిళా అధ్యక్షురాలు), శ్రీమతి అంజనీ కుమారి (తెలంగాణ మహిళా అధ్యక్షురాలు), భారతీదేవి (మహిళా కార్యదర్శి), శరత్ బాబు, ప్రసాద్, శివకుమారి, షేక్ తదితరులు పాల్గొని డా. పెరుక రాజును అభినందించారు.
ప్రస్తుతం డా. పెరుక రాజు భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూనే, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, బహుభాషావేత్తగా సాహితీ సేవలను కొనసాగిస్తున్నారు. సైనికుడిగా దేశసేవ చేస్తూనే, అక్షర సైనికుడిగా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
ఆయన సాహితీ ప్రస్థానంలో మరో రెండు విశిష్ట సంపుటాలు త్వరలో పాఠకుల ముందుకు రానున్నాయి. జవాన్ పేరుతో తెలుగు కవితా సంపుటి, పేరుతో ఆంగ్ల కవితా సంపుటి ప్రచురణకు సిద్ధమవుతున్నాయి. సైనిక జీవనానుభవాలు, దేశభక్తి, మానవీయ స్పందనలకు జవాన్ అక్షరరూపమిస్తే, జీవితం, సమాజం, మానవత్వంపై ఆయన ఆంగ్ల కవితా స్వరాన్ని ఆవిష్కరించనుంది.
విశ్వ సాహితీ కళావేదిక నిర్వహించే సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ, గురువుకు అక్షర నీరాజనం కవితా పోటీలో విజేతగా నిలిచిన డా. పెరుక రాజుకు విశ్వ సాహితీ కళావేదిక బృందం హృదయపూర్వక శుభాభినందనలు తెలిపింది.












