ఉరుకుల పరుగుల నేటి జీవితంలో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు పిల్లలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వారి కథలు, విలువలు రేపటి తరానికి జీవిత పాఠాలుగా మారతాయని, గ్రాండ్ పేరెంట్స్ వీక్ సందర్భంగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వృద్ధాప్యంలో వారిని ఒంటరిగా వదిలేయకుండా, ఎన్నటికీ మరువము అనే భరోసా ఇవ్వాలని సూచించారు.
ఉరుకుల పరుగుల నేటి జగత్తులో తాతయ్యలు పచ్చని నీడల వంటివారు. ఆధునిక కాలపు అల్లరి ముందు అమ్మమ్మలు, నానమ్మలు ఆదర్శమూర్తులుగా నిలుస్తారు. సెల్ ఫోన్ లోనే లోకం చూసే పిల్లల చేతిని పట్టుకుని, కనుమరుగవుతున్న కథలను చెబుతూ, కమ్మని విలువలను నేర్పాలి. తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలు మనుమలకు, మనుమరాళ్లకు రేపటి జీవిత పాఠాలుగా నిలుస్తాయి. నీతి కథలు రేపటి తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలుగా మారతాయి.
అమ్మ, నాన్నలు ఉద్యోగాలలో అలిసి సొలసి ఇల్లు చేరినప్పుడు, పిల్లల బాధ్యతను భుజానవేసి, భరోసా ఇచ్చే తోడుగా ఉండాలి. నేను నిన్ను ఎన్నటికీ మరువను అంటూ పెద్దల ప్రేమ మనకు రక్షణగా నిలవాలి. పాతకాలపు అనుభవాలను కొత్త తరానికి ఆస్తిగా పంచాలి. కోపాలు తగ్గించి, స్నేహం పెంచి, మనుమలు, మనుమరాళ్లు మంచి మనుషులుగా ఎదగాలి.
బడి నేర్పే ఎన్నో పాఠాలను ఒడిలోనే సులువుగా చెప్పాలి. నేటి సమాజపు మార్పులను గమనిస్తూ, నైతిక రక్షణగా నిలవాలి. తాత, బామ్మలు అత్యుత్తమ గుణాలు, నైతికత, మానవీయ విలువలను ప్రేమగా, అవలీలగా, ఉచితంగా, ఆసక్తికరంగా నేర్పే మేధావులని గుర్తించాలి.
గ్రాండ్ పేరెంట్స్ అంటే కేవలం వృద్ధులు కాదు, వారు మన సంస్కృతికి వారధులు. 2026 అంతర్జాతీయ థీమ్ వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయకుండా, మిమ్మల్ని ఎన్నటికీ మరువము అనే నమ్మకాన్ని మనం వారికి ఇవ్వాలి.
తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు, పిల్లలను పెంచే బాధ్యతలో భాగస్వాములు అవుతూనే, వారికి డిజిటల్ ప్రపంచంలో డిప్రెషన్‌కు లోను కాకుండా మానసిక స్థిరత్వం అందించే గొప్ప శక్తి కేవలం తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలకే ఉంది.
తాత, బామ్మలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. పెద్దలను గౌరవిస్తూ, వారి మార్గదర్శకత్వంలో పిల్లలను పెంచినప్పుడు సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందనే సత్యాన్ని సమాజం గుర్తించాలి.
గ్రాండ్ పేరెంట్స్ డే లో పాల్గొన్నవారు: శ్రీమతి ఎస్ పద్మావతి (అమ్మమ్మ), ఎస్ లక్ష్మీ చంద్ర రెడ్డి (తాతయ్య), టి మనస్విని రెడ్డి (మనుమరాలు). నేదునూరి కనకయ్య, అధ్యక్షులు, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం, రచయిత, కాలమిస్ట్, కరీంనగర్. ఫోన్: 9440245771












