గోదావరి పుష్కరాల పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాసరలోని ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు సూచించారు. సాధారణ భక్తులతో పాటు ప్రత్యేక అతిథుల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్యను లెక్కించడం వంటి అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
పనుల్లో నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం
పుష్కరాల పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పుష్కరాల కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో భైంసా ఉప కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ రమేష్, రహదారులుభవనాలు, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల శాఖల కార్యనిర్వహణ ఇంజనీర్లు సుభాష్, సందీప్, అనిల్, బాసర ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి, తహసీల్దార్ పవన్చంద్రతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












