నిజామాబాద్, 9 November
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోరమైన పాలనలో అరెస్టుల పరంపర యథేచ్ఛగా కొనసాగుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోరమైన పాలనలో అరెస్టుల పరంపర యథేచ్ఛగా కొనసాగుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి సింహస్వప్నమైన పట్నం నరేందర్ రెడ్డిపై కక్ష గట్టి అరెస్ట్ చేయడం అక్రమమని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. లాఠీలు, తూటాలు, అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ ను అడ్డుకోలేరని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త అంత్యక్రియలలో పాల్గొనేందుకు, ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తున్న నరేందర్ రెడ్డిని పరిగి బహార్పేట్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకుని, అకారణంగా అరెస్ట్ చేయడం దారుణమని జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అందిస్తున్నామని, పగలు, ప్రతీకారాలు ఉండవని ఊదరగొట్టి, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హింసాత్మక పాలన సాగిస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అణచివేయడమే పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రశ్నించే గొంతులను నొక్కడం, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, సమయం, సందర్భం లేకుండా అరెస్టులు చేయడం, నాటి ఎమర్జెన్సీని తలపించే విధంగా నిరంకుశ నిర్బంధాలు అమలు చేయడం నిత్యకృతమైందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే, పరామర్శించే హక్కు కూడా లేకుండా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రాతియుగ రాక్షస పాలనకు నిలువెత్తు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో గులాబీ సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలని, అరెస్టుల అరాచకం మానుకోవాలని ఆయన హితవు పలికారు. న్యాయంగా అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు ఢిల్లీలో తాగి తన్నుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి దుర్నీతికి, మోడీ, బాబులతో సీఎం కున్న స్నేహానికి తెలంగాణ బలి అవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పాడిపంటలతో తెలంగాణ కళకళలాడగా, రేవంత్ పాలనలో అగ్నిమంటలు ప్రజలను దహించివేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. భూకబ్జా కోరులైన రేవంత్ సోదరుల అంతులేని అవినీతికి తెలంగాణ ప్రయోగశాలగా మారిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, గ్రామం ఏదైనా కాంగ్రెస్ సర్కారుపై ప్రజా సంగ్రామమేనని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కండకావరానికి అన్ని వర్గాల ప్రజలు తిరగబడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తగులబడుతుంటే దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి ఢిల్లీ వెళ్లి సీఎం, మంత్రులు ఫిడేల్ వాయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలో విఫలమయ్యారని, అవినీతి, ఆరాచకాల్లో సఫలమయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పుణ్యమా అని రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరణశాసనమని ఆయన అన్నారు. ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఇదేం ప్రజాపాలన అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.






