ఉత్తరాఖండ్‌లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు చిన్నారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర బాలల వీరత్వ పురస్కారాలను అందజేశారు. శుక్రవారం డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు పతకాలు, ప్రశంసాపత్రాలు, రూ.51 వేల నగదు బహుమతిని అందించారు.
మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలిసారిగా ఈ పురస్కారాలను అందించారు. వివిధ ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని ప్రదర్శించిన చిన్నారులను ప్రభుత్వం గుర్తించి గౌరవించింది.
చమోలీ జిల్లాకు చెందిన దివ్య, దీపిక, ఆరవ్ సింగ్‌లు ఎలుగుబంటి దాడి సమయంలో చూపిన ధైర్యానికి పురస్కారానికి ఎంపికయ్యారు. 2022లో హరిశంకర్ పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి ఆరో తరగతి విద్యార్థి ఆరవ్‌పై దాడి చేసింది. ఆ సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని దివ్య ఎలుగుబంటిని వెంబడిస్తూ ఆరవ్‌ను రక్షించేందుకు ప్రయత్నించింది. మరో విద్యార్థిని దీపిక వెంటనే తొమ్మిది మంది విద్యార్థులను తరగతి గదిలోకి తీసుకెళ్లి సురక్షితంగా కాపాడింది.
చంపావత్ జిల్లాకు చెందిన మాయ నదిలో కొట్టుకుపోతున్న బాలికను రక్షించి ధైర్యాన్ని చాటుకుంది. 2025లో భారీ వర్షాల కారణంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ బాలిక నీటి ప్రవాహంలో చిక్కుకుంది. మాయ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిలోకి దిగి ఆమెను రక్షించింది. ఈ ప్రయత్నంలో మాయ కూడా గాయపడింది.
డెహ్రాడూన్‌కు చెందిన ఆరాధ్య 2022లో మేఘ విస్ఫోటనం కారణంగా వరదలు, బురద ప్రవాహం సంభవించిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించింది. తన ఇంట్లో ఉన్న 17 మందిని వెంటనే హెచ్చరించి సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా చేసింది. మూడేళ్ల చిన్నారిని కూడా వరద నీటి నుంచి కాపాడింది.
టెహ్రీ గఢ్వాల్ జిల్లాకు చెందిన శ్వేత ఓ వృద్ధుడిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టకుండా సమయస్ఫూర్తితో రక్షించింది. రోడ్డుపై నడుస్తున్న వృద్ధుడిని వెంటనే పక్కకు తీసుకెళ్లి ప్రమాదం నుంచి కాపాడింది.
పిల్లల్లో ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం, ఇతరులకు సహాయపడే గుణాలను ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.










