దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 108 అత్యవసర సేవల సంస్థ సూచించింది. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. పండుగ వేళ ప్రమాదాలు జరగకుండా ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి సమస్యలు, ఇతర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. గత గణాంకాల ప్రకారం, 2025లో సాధారణ రోజుల్లో 1,766 మంది అగ్నిప్రమాదాల కారణంగా గాయపడగా, దీపావళి రోజున బాణసంచా ప్రమాదాల కారణంగా 1,699 మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. ఈ గణాంకాలు పండుగ సమయంలో అప్రమత్తత ఎంత అవసరమో తెలియజేస్తున్నాయని వివరించింది.
స్టేట్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ శ్రీ బి. సుధాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మండలంలో అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని, 108 అత్యవసర సేవలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు వెంటనే 108కు కాల్ చేయాలని సూచించారు.
బాణసంచా కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
1. బాణసంచాను ఇళ్లలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. 2. పిల్లలు, వాహనాలు, వృద్ధులు మరియు మందులు నిల్వ ఉంచే ప్రాంతాలకు దూరంగా బాణసంచా కాల్చాలి. 3. శరీరానికి సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించకూడదు. 4. బాణసంచా కాల్చేటప్పుడు సురక్షితమైన దూరం పాటించాలి. 5. చిన్నపిల్లలు పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే బాణసంచా కాల్చాలి. 6. అవసరమైన సందర్భాల్లో కళ్లకు రక్షణగా గాగుల్స్, మాస్క్ ధరించాలి. 7. చేతితో బాణసంచా పట్టుకుని పేల్చే ప్రయత్నం చేయకూడదు. నేలపై ఉంచి, సురక్షిత దూరం పాటిస్తూ కాల్చాలి. 8. అనుకోని అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు దగ్గరలో ఒక బకెట్ నీరు లేదా ఇసుకను సిద్ధంగా ఉంచుకోవాలి. 9. పేలని బాణసంచాను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదు.
అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
1. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం 108కు కాల్ చేయాలి. 2. కాలిన గాయాలపై ఐస్ ఉపయోగించకుండా, ప్రభావిత ప్రాంతాన్ని సాధారణ చల్లని నీటితో సుమారు 20 నిమిషాల పాటు చల్లబరచాలి. 3. గాయపడిన ప్రాంతాన్ని శుభ్రమైన, మెత్తటి వస్త్రంతో లేదా స్టెరైల్ డ్రెస్సింగ్‌తో కప్పాలి. 4. కాలిన గాయాలపై క్రీములు, ఇంకు, టూత్‌పేస్ట్ వంటి పదార్థాలను పూయకూడదు. 5. కాలిన గాయాలపై ఏర్పడిన బొబ్బలను పగలగొట్టకూడదు. చర్మానికి అంటుకున్న దుస్తులను బలవంతంగా తొలగించకూడదు. 6. వైద్యుల సూచన మేరకు మాత్రమే ఆయింట్మెంట్లు ఉపయోగించాలి. అవసరమైనప్పుడు వైద్య చికిత్స పొందాలి.
మన చిన్నపాటి జాగ్రత్త.. మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. బాధ్యతాయుతంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని 108 అత్యవసర సేవల సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.












