అల్లంపల్లి, కడెం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 18
మండల పరిధిలోని అల్లంపల్లి గ్రామానికి చెందిన మీసాల గంగామణి అనే గర్భిణికి గురువారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే నొప్పులు తీవ్రమవడంతో, 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే సురక్షితంగా ప్రసవం చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
సమయానికి స్పందించి వైద్య సేవలు అందించడంలో 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది మరోసారి తమ మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని అల్లంపల్లి గ్రామానికి చెందిన మీసాల గంగామణి అనే గర్భిణికి గురువారం ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కడెం 108 సిబ్బంది అల్లంపల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అయితే, వారు అక్కడికి చేరుకునే సమయానికి గంగామణికి నొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఆసుపత్రికి తరలించేంత సమయం లేకపోవడంతో, పరిస్థితిని గమనించిన ఈఎంబీ () అరుణ్, పైలట్ వసంత్ అత్యవసర నిర్ణయం తీసుకున్నారు.
ఇంటి వద్దనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రసవం జరిపించారు. అరుణ్, వసంత్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో గంగామణి సురక్షితంగా మగబిడ్డకు (బాబు) జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. అనంతరం మెరుగైన వైద్య సంరక్షణ కోసం తల్లి, నవజాత శిశువును కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడ అడ్మిట్ చేశారు. సకాలంలో స్పందించి, సుఖ ప్రసవం జరిపించి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటి అరుణ్, పైలట్ వసంత్లను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందించారు.












