నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మోర్తాడ్ మండలంలో ప్రజలు డెంగ్యూ, విష జ్వరాల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ విషయమై సోమవారం జరిగిన ప్రజావాణిలో బాధితులు మండల అధికారులకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున డెంగ్యూ, విష జ్వరాల బారిన పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు. పేదలు చేసేదేమీ లేక అప్పు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు చెల్లించి డెంగ్యూ, విష జ్వరాలకు చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ విషయం స్థానిక వైద్యాధికారులకు, జీపీ పాలకవర్గ సభ్యులకు, జీపీ సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని, గ్రామం తో పాటు, ఆయా గ్రామాలలో పూర్తిస్థాయి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, స్థానికంగా వైద్యులు నిరంతర చికిత్సలు అందించాలని మండల, స్థానిక ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోకపోతే, రాబోయే కాలంలో ఏలికల ప్రభావం వల్ల మరింత మంది డెంగ్యూ, విష జ్వరాల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మండల వాసులు పేర్కొంటున్నారు. స్థానికంగా ప్రతి పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాలు కొనసాగించాలని మండల వాసులు కోరుతున్నారు.












