ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం, భారత మార్కెట్లో తన 200 డ్యూక్ మోటార్‌సైకిల్‌ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసి విడుదల చేసింది. కొత్త సాంకేతిక ఫీచర్లు, రైడర్ సహాయక వ్యవస్థలను జోడించిన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.2.07 లక్షలుగా నిర్ణయించింది.
పాత మోడల్‌తో పోలిస్తే ధర సుమారు రూ.1,552 పెరిగింది. తాజా కేటీఎం 200 డ్యూక్‌లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఫీచర్లను మెరుగుపరిచారు. ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటిల్ వ్యవస్థను అందించారు. దీని ద్వారా స్ట్రీట్, రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. రహదారి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బైక్ స్పందనను సర్దుబాటు చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
అదనపు ఫీచర్లు
అలాగే బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ను జోడించారు. దీని సాయంతో క్లచ్‌ను ఉపయోగించకుండానే గేర్లను పైకి, కిందికి మార్చుకునే వీలుంది. వెనుక చక్రం జారిపోకుండా నియంత్రించేందుకు ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థను కూడా అందించారు. ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉపయోగపడే క్రాల్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది.
కొత్త ఫీచర్లు వచ్చినప్పటికీ బైక్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 199.5 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 25 బీహెచ్పీ గరిష్ఠ శక్తిని, 19.3 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ జతచేయబడింది.
రంగులు, డిస్ప్లే
కొత్త మోడల్లో లిక్విడ్ కార్బన్, స్లేట్ గ్రే అనే రెండు రంగులను పరిచయం చేశారు. లిక్విడ్ కార్బన్ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. బైక్‌లో 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే కొనసాగుతుంది. కొత్త రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను నియంత్రించేందుకు కుడివైపు స్విచ్‌గేర్‌ను కూడా అప్డేట్ చేశారు.
కొత్త కేటీఎం 200 డ్యూక్ ధర రూ.2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదనపు ఫీచర్లతో ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, ఇంజిన్ సామర్థ్యం మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంది. ఈ అప్డేట్తో 200 డ్యూక్‌లో పెద్ద మోడళ్లకు అందించే కొన్ని ఎలక్ట్రానిక్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆటోమొబైల్ నివేదికలు పేర్కొన్నాయి.












