ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ తన పర్యటనలో భాగంగా చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. మంగళవారం ఆగ్రాకు చేరుకున్న ఆయన, ప్రపంచ ప్రఖ్యాత కట్టడం అందాలను ఆస్వాదిస్తూ అక్కడ గడిపిన క్షణాలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.
తాజ్‌మహల్ ప్రాంగణంలోని పలు ప్రదేశాల్లో ఫొటోలకు పోజులిస్తూ, అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు.
వాహ్ తాజ్ అంటూ వీడియో పోస్ట్
తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించిన వీడియోను దిల్జీత్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. వాహ్ తాజ్ బోలియే అనే వ్యాఖ్యతో పాటు తన ఆరా ఇండియా టూర్ 2026 పేరును కూడా ప్రస్తావించారు. ఈ పర్యటనలో ఆయన బూడిద రంగు టీషర్ట్, ఎరుపు రంగు జాకెట్, నీలం రంగు జీన్స్, తనదైన తెల్లటి తలపాగాతో కనిపించారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
అక్టోబర్ 30న ఢిల్లీలో సంగీత కచేరీ
దిల్జీత్ ప్రస్తుతం తన ఆరా ఇండియా టూర్ 2026లో భాగంగా దేశంలోని పలు నగరాల్లో సంగీత కచేరీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రదర్శన జరగనుంది.
తొలుత భద్రతాపరమైన కారణాలతో అనుమతిపై సందిగ్ధత ఏర్పడినప్పటికీ, నిర్వాహకులతో చర్చల అనంతరం ఢిల్లీ పోలీసులు కార్యక్రమానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఈ ప్రదర్శన నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగనుంది.
ఢిల్లీ కచేరీ తర్వాత ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో నగరాల్లోనూ దిల్జీత్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. చండీగఢ్‌లో నిర్వహించే కచేరీకి సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటించనున్నారు. తాజ్‌మహల్ సందర్శనతో పాటు తన సంగీత పర్యటనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ దిల్జీత్ వార్తల్లో నిలిచారు.












